ఢిల్లీలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

23-12-2019 Mon 07:40
  • వస్త్ర గోదాములో అంటుకున్న మంటలు 
  • తీవ్రంగా గాయపడిన మరో 10 మంది
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

ఈ తెల్లవారుజామున ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఓ వస్త్ర గోదాములో మంటలు అంటుకుని అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ నెల 8న అనాజ్‌మండి ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.