Andhra Pradesh: రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించే దమ్ము మీకుందా?: వర్ల రామయ్య సవాల్

  • ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏంటో చెప్పిన వర్ల రామయ్య
  • మంత్రి బుగ్గనకు సవాల్
  • టీడీపీపై ఆరోపణలకు దీటుగా బదులిచ్చిన వర్ల

వైసీపీ నేతలకు టీడీపీ నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు. రాజధానిలో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు శాసనసభలో ఆరోపించారని, ఇప్పుడు తాను చాలెంజ్ చేస్తున్నానని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించే దమ్ము మీకుందా అంటూ ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ప్రకటన వచ్చినప్పటినుంచి రాజధాని డిక్లేర్ అయ్యే వరకు జరిగిన భూముల కొనుగోళ్లే ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందకు వస్తాయని వర్ల రామయ్య స్పష్టం చేశారు. 2014 జూన్ 2 నుంచి, 2014 సెప్టెంబరు 4 మధ్య కాలంలో పొలాలు కొన్నవాళ్లే ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టుగా భావించాలని అన్నారు.

దీనిపై ఆరోపణలు చేసిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రాజధాని వస్తుందని టీడీపీ నాయకులు 4 వేల ఎకరాలు కొన్నారని బుగ్గన ఆరోపణ చేశారని, మరి ఆ ఆరోపణలు నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు. ఆ సమయంలో ట్రేడింగ్ జరిగింది 125 ఎకరాలు మాత్రమేనని వర్ల రామయ్య స్పష్టం చేశారు.

"అధికారం మీది, ప్రభుత్వం మీది, మేం అవినీతికి పాల్పడ్డామని చాతనైతే నిరూపించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. అబద్ధాలు మాట్లాడతావా, 4 వేల ఎకరాలు కాదు, 1000 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చూపించు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా అడుగుతున్నాను. నువ్వు నిరూపించగలిగితే నీకు శిరసు వంచి నమస్కరిస్తా, నిరూపించలేకపోతే రాజధాని ప్రజలకు క్షమాపణలు చెప్పు" అంటూ వర్ల రామయ్య నిప్పులు చెరిగారు.

More Telugu News