Janasena: పవన్ కల్యాణ్ వేల పుసక్తాలు చదివారో, అట్టలపై పేర్లు చదివారో!: సి.రామచంద్రయ్య సెటైర్లు

  • పుస్తకాలు చదివిన వాళ్ల నాలెడ్జ్, ఆలోచనా తీరు వేరు
  • చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే అనుసరిస్తారు
  • ఏది మంచి? ఏది చెడు? అన్న ఆలోచన పవన్ కు లేదు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత సి.రామచంద్రయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు మరొకరు తోడయ్యారంటూ పవన్ పై విమర్శలు చేశారు. పవన్ కు ఆలోచనా శక్తి ఉందో లేదో కానీ, చంద్రబాబు ఏం చెబితే అది అనుసరిస్తారని ఆరోపించారు. ప్రజలకు ఏది మంచి? ఏది చెడు? అన్న ఆలోచన కూడా లేదని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల అంశంపై పవన్ సోదరుడు చిరంజీవి సపోర్ట్ ఇచ్చారని, ‘మీ అన్న సపోర్ట్ చేశారని మిమ్మల్ని చేయమని అడగడం లేదు’ కానీ, చంద్రబాబు ఏ ఆలోచనా ధోరణితో ఉన్నారో, అదే ధోరణితో పవన్ వెళ్లడం సబబు కాదని చెప్పారు.

వేల పుస్తకాలు చదివానని చెబుతున్న పవన్, పుస్తకాలు చదివారో అట్టలపై పేర్లు చదివారో తనకు అర్థం కావట్లేదంటూ సెటైర్లు విసిరారు. పుస్తకాలు చదివిన వాళ్ల నాలెడ్జ్, ఆ ఆలోచనా తీరు వేరుగా వుంటుందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఓ లెక్క అంటూ పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్లకు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక తమకు సపోర్ట్  చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీని మాజీ ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ్ ఇటీవల వీడిన అంశాన్ని ప్రస్తావించారు. కులాల, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ చూస్తున్నారన్న అతని వ్యాఖ్యలు ప్రజలపై చాలా ప్రభావం చూపించాయని అభిప్రాయపడ్డారు.

More Telugu News