YSRCP: బాబు అనుభవం దోచుకోవడానికి ఉపయోగపడింది.. జగన్ కు ఏమో ఆత్రం ఎక్కువ: కన్నా

  • రాజధాని మార్చాలనుకోవడం కక్ష సాధింపులా  ఉంది
  • పరిపాలనా వికేంద్రీకరణ కరెక్టు కాదు
  • జగన్ కు అనుభవ రాహిత్యం, అవగాహనా రాహిత్యం

రాజధాని నిర్మాణం కోసం అభిప్రాయ సేకరణ అంటే అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఇల్లు కట్టుకోవడానికో, వైసీపీ కార్యాలయం నిర్మించుకోవడానికో కాదు కనుక రాజకీయపార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి కానీ, అలా జరగలేదని విమర్శించారు. రాజధాని గురించి వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో మాట్లాడితే అందరితో మాట్లాడినట్టు కాదు కదా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని మార్చాలనుకోవడం  ఏదో కక్ష సాధింపుచర్యలా ఉందని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తాం కానీ పరిపాలనా వికేంద్రీకరణను కాదని చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల తికమక పరిస్థితులు తలెత్తుతాయని, ఖర్చుతో కూడుకున్న పని అని అన్నారు.

రాష్ట్ర విభజనతో నష్టపోయిన తమ రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ పైసా ముఖ్యమేనని సూచించారు. ప్రతి పైసాను అభివృద్ధికి వినియోగిస్తారన్న నమ్మకంతో గతంలో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు కానీ, ఆయనకు ఉన్న అనుభవం అంతా దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. జగన్ కు ఏమో అనుభవ రాహిత్యం, అవగాహనా రాహిత్యం ఈ రెండూ ఉన్నాయని, దీనికితో ‘ఆత్రం’ కూడా చాలా ఎక్కువగా ఉందని, వీటితో రాష్ట్రానికి చాలా ప్రమాదమని అన్నారు.

More Telugu News