ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: వైసీపీ నేత సి.రామచంద్రయ్య

22-12-2019 Sun 16:09
  • నాడు చంద్రబాబు  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు
  • జీఎన్ రావు కమిటీ నివేదిక రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది
  • భూములిచ్చిన రైతులకు జగన్ న్యాయం చేస్తారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుందని, ఈ నివేదికపై లేనిపోని రాద్ధాంతాం చేయడం తగదని సూచించారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏం చేసినా తన సొంత ప్రయోజనాల కోసమే చేస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన హయాంలో ఏ దేశ పర్యటనకు వెళితే ఆ దేశపు రాజధానిలా అమరావతిని నిర్మిస్తామని చెప్పారని విమర్శించారు.

పదమూడు జిల్లాలు ఉన్న చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నిస్తున్న మేధావులకు ఓ ప్రశ్న వేస్తున్నా.. ప్రపంచంలోని గొప్ప రాజధానుల్లా అమరావతిని నిర్మిస్తానని నాడు చంద్రబాబు చెప్పారని, మరి, ఈ చిన్న రాష్ట్రానికి అలాంటి రాజధాని అవసరమా అని ప్రశ్నించారు.

అమరావతి ప్రాంత రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, ఈ ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా చేసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, సీఎం జగన్ కచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పారు. మూడు రాజధానుల అంశాన్ని కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్వాగతించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.