విండీస్ ఓపెనర్లను వెనక్కి పంపిన టీమిండియా బౌలర్లు

22-12-2019 Sun 15:07
  • చెరో వికెట్ తీసిన జడేజా, షమీ
  • టాస్ గెలిచిన టీమిండియా
  • విండీస్ కు బ్యాటింగ్ అప్పగింత

కటక్ లోని బారాబతి స్టేడియంలో టీమిండియా బౌలర్లు ఆశాజనకమైన ప్రదర్శన చేస్తున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే ఇక్కడి పిచ్ పై ప్రమాదకర విండీస్ ఓపెనర్లను ఓ మోస్తరు స్కోర్లకు అవుట్ చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) శుభారంభాన్నందించారు. తొలి వికెట్ కు 57 పరుగులు జోడించారు.

అయితే, స్పిన్నర్ రవీంద్ర జడేజా టీమిండియాకు బ్రేకిచ్చాడు. లూయిస్ ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత కాసేపటికే హోప్ ను షమీ అవుట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్ 21 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసింది. క్రీజులో రోస్టన్ చేజ్, హెట్మెయర్ ఆడుతున్నారు.