జీఎస్టీ దాడుల వార్తలపై మీడియాకు హితవు పలికిన యాంకర్ అనసూయ

22-12-2019 Sun 14:19
  • ఇటీవల హైదరాబాదులో జీఎస్టీ దాడులు
  • యాంకర్ అనసూయ నివాసంలోనూ తనిఖీలు చేసినట్టు వార్తలు
  • ట్విట్టర్ లో స్పందించిన అనసూయ

కొన్నిరోజుల క్రితం హైదరాబాదులో జీఎస్టీ అధికారులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టాలీవుడ్ సెలబ్రిటీల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటికే యాంకర్ సుమ స్పందించి తన నివాసంలో సోదాలు జరగలేదని, మీడియాలో తప్పుగా ప్రచారం జరిగిందని అన్నారు. తాజాగా యాంకర్ అనసూయ కూడా ఇదే తరహాలో మీడియాకు హితవు పలికారు.

మీడియా సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలే తప్ప, వ్యక్తిగత అభిప్రాయాలను అందించరాదని అన్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో సోదాలు జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని, ఒకరి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించకుండా, నిర్ధారణ అయిన తర్వాతే వార్తలు అందించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు అనసూయ ట్వీట్ చేశారు.