కల్లు దుకాణాల వద్ద మహిళలకు వల...నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం తర్వాత హత్య!

22-12-2019 Sun 12:25
  • కిరాతకుడిని పట్టుకున్న మహబూబ్ నగర్ పోలీసులు ?
  • ఇప్పటికే ఏడుగురిని హతమార్చినట్టు నిర్ధారణ 
  • కూపీ లాగుతున్న పోలీసులు

కల్లు దుకాణాలే అతని అడ్డా. అక్కడికి వచ్చిన మహిళల పై కన్నేస్తాడు. వీలు చూసుకుని మాట కలుపుతాడు. వలకు చిక్కితే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్యచేసే నిందితుడిని మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఈనెల 17న జిల్లాలోని దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారు పంటపొలాల్లో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. నవాబు పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలు (53)గా ఆమెను గుర్తించారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాల మేరకు ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

పాత నేరస్తుల పనే ఇదని అనుమానించిన పోలీసులు వలవేసి ఈ నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ నిందితుడు కల్లు కాంపౌండ్ వద్ద మాటువేసి మహిళలను ట్రాప్ చేసేవాడని తేల్చారు. తన వలలో చిక్కిన వారిని దూరంగా తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేసేవాడని నిర్ధారించారు. 

ఈ విధంగా ఏడుగురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘోరానికి పాల్పడింది ఇతను ఒక్కడేనా, వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాలపై ఆరాతీస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఈ విషయాలేవీ బయటకు చెప్పడం లేదు.