ఏపీ సచివాలయం వెళ్లే మార్గానికి ముళ్ల కంచె వేసిన పోలీసులు ఉద్రిక్తత

22-12-2019 Sun 12:18
  • వెలగపూడిలోని సచివాలయం ముట్టడికి యత్నం
  • మందడంలో భారీగా మోహరించిన పోలీసులు 
  • పోలీసులతో విద్యార్థులు, రైతులు వాగ్వివాదం

రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై అమరావతిలో రైతులు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలోని సచివాలయం ముట్టడికి రైతులు, విద్యార్థులు ర్యాలీగా వస్తుండడంతో ఆ ప్రాంతానికి వెళ్లే మార్గానికి పోలీసులు ముళ్లకంచె వేశారు. దీంతో ఆందోళనకారులు మందడం వైపునకు వెళ్లారు. అయితే, మందడంలో భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. పోలీసులతో విద్యార్థులు, రైతులు వాగ్వివాదానికి దిగారు.

మందడం వై జంక్షన్‌ వద్ద రైతులు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. అమరావతిని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా విద్యార్థులు కూడా నిరసనలో పాల్గొంటున్నారు. రోడ్డుపైనే బైఠాయించిన రైతులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.