అందుకే జగన్ కు చిరంజీవి వంతపాడుతున్నారు: రమేశ్ నాయుడు

22-12-2019 Sun 12:09
  • చిరంజీవికి రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదు 
  • మూడు రాజధానులు మంచివని అంటున్నారు
  • విశాఖపట్నంలో లాభాపేక్ష కోసమే ఇలా మాట్లాడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మూడుకళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేశ్ నాయుడు విమర్శలు గుప్పించారు. ఈ రోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్ల క్రితం ఉన్న గందరగోళ పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమయ్యాయని చెప్పారు.

హైకోర్టు రాయలసీమకే రావాలని బీజేపీ కోరుకుంటోందని రమేశ్ నాయుడు తెలిపారు. గొప్ప రాజధాని నిర్మాణం కావాలని జగన్ గతంలో అసెంబ్లీలో అన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ప్రయోజనాలు లేవని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబుతో జగన్ కు ఉన్న వైరాలతో ప్రజలు బలయిపోతున్నారని అన్నారు.

చిరంజీవి మూడు రాజధానులు మంచివని అంటున్నారని రమేశ్ నాయుడు అన్నారు. ఆయనకు ఏపీలో కనీసం ఓటు హక్కు కూడా లేదని, ఆయన రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో లాభాపేక్ష కోసమే ఆయన జగన్ కు వంతపాడుతున్నారని ఆరోపించారు. జీఎన్ రావు ఇచ్చిన నివేదిక జగన్ కి సానుకూలంగా ఉందని అన్నారు.