టెంటు వేయకుండా అడ్డుకున్న పోలీసులు.. మందడంలో ఎండలోనే రైతుల దీక్ష.. ఉద్రిక్తత

22-12-2019 Sun 10:50
  • రైతుల దీక్షకు విట్ వర్సిటీ విద్యార్థుల మద్దతు 
  • ప్రధాన రహదారిపై బైఠాయింపు
  • రహదారిపై పడవ పెట్టి రైతుల నిరసన 
  • పడవను బలవంతంగా పక్కకు తప్పించిన పోలీసులు

రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మందడంలో రైతుల దీక్షకు విట్ వర్సిటీ విద్యార్థులు మద్దతు తెలిపారు.

రైతుల దీక్షకు టెంటు వేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలోనే ధర్నా కొనసాగిస్తున్నారు. మందడంలో కొందరు రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. రహదారిపై పడవ పెట్టి రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, రైతులు పెట్టిన పడవను పోలీసులు బలవంతంగా పక్కకు తప్పించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమకు మద్దతు ఇస్తున్నవారిని పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు. మందడంలో పోలీసులు భారీగా మోహరించారు. పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను తామే తుడిచేశామని రైతులు ప్రకటించారు.