Facebook: 26.7 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల వివరాలు హ్యాకర్ల చేతికి!

  • ఈ సంవత్సరం మూడోసారి యూజర్ల వివరాలు హ్యాక్
  • హ్యాకర్ల చేతిలో ఫేస్ బుక్ యూఐడీ కూడా
  • ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

ఈ సంవత్సరం మూడో సారి ఫేస్ బుక్ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కింది. ఈసారి మొత్తం 26.7 కోట్ల మందికి చెందిన అత్యంత సున్నిత వివరాలు హ్యాకర్ల ఫోరమ్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఈ విషయాన్ని 'కంపారిటెక్' సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ బాబ్ డయాచెక్ నో తొలిసారిగా గుర్తించారు. గత సంవత్సరం వెలుగులోకి వచ్చిన కేంబ్రిడ్జ్ అనలిటికా ఉదంతం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ దఫా హ్యాకర్ల చేతిలో ఫేస్‌ బుక్‌ యూఐడీ (యూజర్ల విశిష్ట సంఖ్య) కూడా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని బాబ్ తెలియజేశారు. వియత్నాం కేంద్రంగా హ్యాకర్లు రెచ్చిపోయారని, మిగతా యూజర్లంతా డేటాలీక్‌ బారిన పడకుండా ఉండాలంటే, వెంటనే ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చాలని సూచించారు. 'సెండ్‌ డేటా టూ సెర్చింజన్స్‌' అనే ఆప్షన్ ను డిజేబుల్ చేస్తే సరిపోతుందని అన్నారు.

ఇక తమ వినియోగదారుల సమాచారాన్ని కాపాడటంలో ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ వింగ్ పదేపదే విఫలం అవుతుండటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం అక్టోబరులో 2.90 కోట్ల మంది డేటాను హ్యాకర్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఆపై డిసెంబరులో 68 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్ కాగా, క్షమాపణలు కూడా చెప్పింది. ఆపై ఏప్రిల్‌ లో 54 కోట్ల మంది. సెప్టెంబరులో 41.9 కోట్ల మంది డేటా లీకయ్యింది.

More Telugu News