హైదరాబాద్‌లో 60 ఏళ్ల యాచకురాలిపై దారుణం.. మద్యం తాగించి సామూహిక అత్యాచారం

22-12-2019 Sun 08:28
  • ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
  • రోడ్డుపై కనిపించిన యాచకురాలిని ఇంటికి తీసుకెళ్లి దారుణం
  • నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. 60 ఏళ్ల యాచకురాలికి మద్యం తాగించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి కథనం ప్రకారం..

మల్కాజిగిరికి చెందిన చిన్నప్ప (50), నేనావత్ విజయ్ కుమార్ (53)లు స్నేహితులు. ఈ నెల 17న అర్ధరాత్రి ఫుల్లుగా మందుకొట్టిన వీరిద్దరూ రోడ్డు పక్కన కూర్చున్న యాచకురాలిని చూశారు. ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపారు. అనంతరం ఆమెను ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించారు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మైకం నుంచి బయటకు వచ్చిన వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పరారయ్యారు. ఆమె చెప్పింది విన్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిర్జాలగూడలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.