అదే జరిగితే రాష్ట్రంలో సగం మంది క్యూలో నిల్చోవాలి: చత్తీస్‌గఢ్ సీఎం

22-12-2019 Sun 07:52
  • ఎన్ఆర్‌సీని తీవ్రంగా వ్యతిరేకించిన చత్తీస్‌గఢ్ సీఎం
  •  రాష్ట్రంలోని సగం మంది వద్ద ఆధారాలు లేవు
  • అప్పట్లో గాంధీజీ కూడా వ్యతిరేకించారు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ)పై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన ఆయన ఎన్ఆర్‌సీని కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో కనుక ఎన్ఆర్‌సీని అమలు చేస్తే సగం మంది ప్రజలు తాము భారతీయులమని నిరూపించుకోలేరని అన్నారు. ఎందుకంటే భూములు కానీ, భూహక్కు పత్రాలు కానీ వారివద్ద లేవన్నారు.

ఎన్‌ఆర్‌సీ అమలైతే నోట్ల రద్దు నాటి రోజులు మళ్లీ వస్తాయన్నారు. అప్పట్లో డబ్బుల కోసం క్యూలలో నిల్చున్న ప్రజలు ఇప్పుడు తాము భారత పౌరులమేనని నిరూపించుకునేందుకు నిలబడాల్సి వస్తుందన్నారు. చత్తీస్‌గఢ్‌లో 2.80 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వారిలో సగం మంది తమను తాము భారత పౌరులుగా నిరూపించుకునే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

వారి పూర్వీకులు ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చారని, వందేళ్ల క్రితం నాటి పత్రాలను ఇప్పుడు వారు ఎక్కడి నుంచి తీసుకొస్తారని సూటిగా ప్రశ్నించారు. చొరబాటుదారులను గుర్తించేందుకు అనేక సంస్థలు ఉండగా, ఇలాంటి చర్యల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అప్పట్లో దక్షిణాఫ్రికాలో ఇలాంటి కార్యక్రమమే చేపడితే మహాత్మాగాంధీ వ్యతిరేకించారని భూపేష్ బఘేల్ గుర్తు చేశారు. ఎన్ఆర్‌సీ అమలైతే ఆ పత్రాలపై సంతకం చేయని తొలి వ్యక్తిని తానే అవుతానని సీఎం స్పష్టం చేశారు.