యువతి స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ.. గ్రామంలో ఉద్రిక్తత!

22-12-2019 Sun 07:07
  • తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఘటన
  • బాధితురాలి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ
  • పోలీస్ స్టేషన్‌ వద్ద గ్రామస్థుల ఆందోళన

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలి పట్ల ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లికి చెందిన యువతి స్నానం చేస్తుండగా గ్రామానికి చెందిన దిండి రాంకుమార్ (రాము) తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించాడు. గమనించిన యువతి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పరారయ్యాడు. అయితే, అతడి మొబైల్ ఫోన్ మాత్రం ఆమెకు చిక్కింది. దీంతో ఆ ఫోన్ పట్టుకుని ఫిర్యాదు చేసేందుకు గోకవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

ఉదయం 11 గంటలకు స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలిని 2 గంటల వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టడమే కాకుండా మొక్కుబడిగా ఫిర్యాదు స్వీకరించినట్టు బాధితురాలు వాపోయింది. అంతేకాదు, నిందితుడు తనకు కనిపిస్తే ఫోన్ చేసి చెప్పాలని ఎస్ఐ చెన్నారావు తనకు చెప్పారని పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు గ్రామ పెద్దలకు విషయం చెప్పడంతో వారు స్టేషన్‌కు చేరుకుని ఎస్సై తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన సెల్‌ఫోన్‌ను ఎస్సై మాయం చేశారని ఆరోపించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడు రాముపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.