Andhra Pradesh: రాజధాని బినామీల పేర్లతో పుస్తకం వేశాం... అందులో ఉన్నవాళ్లే నష్టపోతారు: విజయసాయిరెడ్డి

  • సుజనా, సీఎం రమేశ్ వంటివాళ్లే నష్టపోతారన్న విజయసాయి
  • రైతులకు నష్టం ఉండదని హామీ
  • దేవినేని ఉమ వ్యాఖ్యలకు స్పందన

ఏపీ రాజధాని వ్యవహారం త్రిముఖపోరాటంలా తయారైంది. ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్షాలు, మధ్యలో ప్రజానీకం! మూడు రాజధానులంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటుండగా, అమరావతి ఉండగా ఇతర రాజధానులెందుకని టీడీపీ అంటోంది. తమకు అన్యాయం జరుగుతోందంటూ రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమరావతి రైతులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

అమరావతి రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, రాజధాని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. రాజధాని బినామీలతో ఒక పుస్తకాన్ని ప్రచురించామని, అందులో పేర్లు ఉన్నవాళ్లు మాత్రమే నష్టపోతారని తెలిపారు. సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటి వ్యక్తులకే నష్టమని సూచనప్రాయంగా వెల్లడించారు.

విశాఖ సమీపంలోని భీమిలి పట్టణానికి రాజధాని రావడం సంతోషంగా ఉందని, భీమిలి ఒక మహాపట్టణంగా వెలుగొందుతుందని విజయసాయి పేర్కొన్నారు. రాజధాని కోసం భూములు సర్వే చేస్తున్నామని, విశాఖ నగరంలో, బయట కూడా సర్వే చేస్తామని, సర్వే పూర్తయ్యాక సీఎం నిర్ణయం తీసుకుంటారని వివరించారు. రాజధాని విషయంలో టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యలపైనా విజయసాయి స్పందించారు. వ్యక్తిత్వంలేని ఉమ కామెంట్లు చేస్తే తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఉమ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News