శ్రీవారి కానుక.. ఉల్లి ‘జుంకా’లతో మెరిసిన ట్వింకిల్!

21-12-2019 Sat 19:54
  • భర్త, నటుడు అక్షయ్ కుమార్ వెరైటీ కానుక
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ట్వింకిల్ ఫొటోలు
  • ఉల్లి ధరల పెరుగుదలపై ఇదో టైపు నిరసన

బాలీవుడ్ మాజీ నటి, నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఉల్లితో తయారుచేసిన జుంకాలను ధరించి తళుక్కుమంది. ఇదంతా షూటింగ్ కోసమనుకునేరు..ఎంతమాత్రంకాదు. దేశంలో పెరిగిన ఉల్లి ధరల తీవ్రతపై అక్షయ్ కుమార్ తన స్పందనను తాజాగా తెలియజేశారు. దేశంలో ఉల్లి ధరలు నింగినంటుతుండటంతో ప్రజలు బెంబేలు పడతున్న విషయం తెలిసిందే. ఈ ఉల్లి ధరల ఘాటు తీవ్రతను ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా గుర్తించారు. ఉల్లి ప్రియంగా మారిందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ట్వింకిల్ ఖన్నాకు ఉల్లితో తయారు చేసిన చెవి జుంకాలను బహుమతిగా అందించారు. ట్వింకిల్ కూడా వాటిని స్వీకరించి తన చెవులకు ధరించింది. అంతేకాక, ఫొటోలకు పోజిచ్చింది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల పట్ల అభిమానులనుంచి లైక్ లు, కామెంట్లు విస్తృతంగా వస్తున్నాయని తెలిపింది.