రాజధానుల విషయంలో సీఎం స్పష్టత ఇవ్వకుండా అభిప్రాయం మాత్రమే చెప్పారు: సీపీఐ అగ్రనేత డి.రాజా

21-12-2019 Sat 19:31
  • గుంటూరులో సీపీఐ 95వ వార్షికోత్సవం  
  • పాల్గొన్న అగ్రనేతలు  
  • రాజధానిపై సీపీఐ కూడా అధ్యయనం చేస్తుందన్న రాజా

గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞానమందిరంలో సీపీఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీపీఐ అగ్రనేతలు డి.రాజా, నారాయణ, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ ఏపీ రాజధానుల అంశంపై వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాజధానుల అంశంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వకుండా కేవలం అభిప్రాయం చెప్పారని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై చర్చ జరగడమే కాకుండా, మరింత అధ్యయనం జరగాలని తెలిపారు. ఇది ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చించాల్సిన విషయమని రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీపీఐ కూడా అధ్యయనం చేస్తుందని వెల్లడించారు. అయితే, అమరావతికి భూములు ఇచ్చిన అంశం వేరు, మూడు రాజధానుల అంశం వేరని అన్నారు.