BJP: మూడు రాజధానుల కాన్సెప్ట్ పై కేంద్రం తగిన సమయంలో స్పందిస్తుంది: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి

  • రాజధాని మార్చడం అంత సులభమైన విషయం కాదు
  • జీఎన్ రావు కమిటీ నివేదికపై అనుమానాలున్నాయి
  • అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. రాజధానులు మార్చడం సరికాదు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల కాన్సెప్ట్ పై కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో స్పందిస్తుందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజధాని మార్చడం అంత సులభమైన విషయం కాదన్నారు. సుజనా ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు మార్చడం సరికాదన్నారు.

జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత పరిపాలనపై దృష్టి పెట్టకుండా.. వ్యక్తిగత దూషణలపైనే సమయం వృథా చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చడం అంత తేలికైన విషయం కాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన ఆరోపించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే.. రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ గురించి కాకుండా.. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుడు సలహాలిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News