రాజధాని అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటాం: టీడీపీ నేత బోండా ఉమ

21-12-2019 Sat 16:54
  • నిపుణుల కమిటీ జగన్ చెప్పినట్లే నివేదిక ఇచ్చింది
  • రాజధానిగా అమరావతిని ప్రతిపక్ష నేతగా జగన్ స్వాగతించారు
  • అమరావతి ప్రాంత రైతుల ప్రయోజనాలకోసం ఎంతకైనా పోరాడతాం
  • ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ యత్నిస్తోంది

రాష్ట్ర రాజధాని, అభివృద్ధిపై సిఫారసులు చేయడానికి వైసీపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ ఓ బోగస్ అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

జగన్ చెప్పినట్లే కమిటీ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. అమరావతిలో ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారికే భూములు ఉన్నాయన్న కారణంగా అమరావతిని అణగదొక్కడానికేకాక, టీడీపీని దెబ్బతీయడానికి ముందస్తు ప్రణాళికమేరకు జీఎన్ రావు కమిటీని నియమించిందన్నారు. వైసీపీ రాసిచ్చిన అంశాలమేరకే కమిటీ నివేదిక ఇచ్చిందంటూ.. విమర్శించారు. రాజధానిపై అమరావతి ప్రాంతంలో రైతులు చేపట్టిన ఆందోళనపై బోండా ఉమామహేశ్వరరావు ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

‘మా ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నామంటే.. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. 30 వేల ఎకరాల భూమిని సమీకరించండి, మేమూ సహకరిస్తామని చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన తర్వాతే రైతులు రాజధాని అమరావతి కోసం భూములిచ్చారు. సీఆర్ డీఏ చట్టం తెచ్చాం. ప్రధాని మోదీ కూడా శంకుస్థాపనకొచ్చారు.

అమరావతి ప్రాంత అభివృద్ధికి టీడీపీ కట్టుబడింది. అమరావతి రాజధానిగా నిర్మాణ ప్రక్రియ ప్రారంభం చేశాం. రోడ్లు నిర్మించాం. భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. పరిశ్రమలు కూడా వచ్చాయి. రాజధాని మార్పుపై వైసీపీ నేతలు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. రైతులకు తిరిగి వారి భూమిలివ్వటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో వారు ఆడుకుంటున్నారన్నారు. సొంత రాజకీయ ప్రయోజనాలకోసం ఇదంతా చేస్తున్నారు. అమరావతి ప్రాంత రైతుల ప్రయోజనాలకోసం అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉంటాము’ అని చెప్పారు.