రాజధానిపై మంత్రి మండలి నిర్ణయం వచ్చిన తర్వాతే స్పందిస్తాం: పవన్ కల్యాణ్

21-12-2019 Sat 15:37
  • ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జీఎన్ రావు కమిటీ
  • స్పందించిన జనసేనాని
  • అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కాదని వ్యాఖ్యలు

ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై జనసేన పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారని, వారి నిర్ణయం తర్వాతే తాము మాట్లాడతామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాన్ని తాము జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తామని వెల్లడించారు. అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కాదని, అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని తెలిపారు.