పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ప్రకటన విడుదల చేసిన 1100 మంది ప్రొఫెసర్లు

21-12-2019 Sat 15:15
  • పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చిన కేంద్రం
  • దేశవ్యాప్తంగా వ్యతిరేకత
  • పొరుగుదేశాల మైనారిటీలను ఆదరిస్తే తప్పేంటన్న ప్రొఫెసర్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఇప్పటికీ నిరసనజ్వాలలు రగుల్చుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము సమర్థిస్తున్నట్టు దేశవ్యాప్తంగా 1100 మంది ప్రొఫెసర్లు ప్రకటన విడుదల చేశారు. వీరిలో పలు యూనివర్శిటీల అధ్యాపకులు, యూజీసీ సభ్యులు ఉన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారిని ఆదరిస్తే తప్పేంటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని, బిల్లును ఆమోదించిన పార్లమెంటును అభినందించారు. కాగా, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో ఇవాళ సైతం నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. వర్సిటీ మెయిన్ గేటు వద్ద విద్యార్థులు, స్థానికులు భారీ ప్రదర్శన చేపట్టడంతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది.