Chandrababu: చంద్రబాబుని దెబ్బకొట్టాలన్న కక్షతో జగన్ ఇలా చేస్తున్నారు: సీపీఐ నారాయణ

  • చంద్రబాబు తీరుతో ఏపీకి నష్టం వచ్చింది
  • రాజకీయాల్లో కక్ష సరికాదు
  • చేసేది మంచా? చెడా? అన్న విషయాలను మాత్రమే చూసుకోవాలి 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'రాజధానికి సంబంధించిన అంశాన్ని మా రాష్ట్ర పార్టీ సమావేశంలో చర్చిస్తోంది. నా అభిప్రాయం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు ఒక దఫా ఒక చోట (నాగ్ పూర్) మరో దఫా మరో చోట జరుగుతున్నాయి' అని అన్నారు.

'కొన్ని రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట.. హైకోర్టు మరో ప్రాంతంలో ఉన్నాయి. ఇలా ఏడెనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ఓ ప్రాంతంలో రాజధాని మరో ప్రాంతంలో ఉన్నాయి. మన దగ్గర రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇంతకు ముందు హైదరాబాద్ లోనే హైకోర్టు ఉంది. హైకోర్టు బెంచీ ఇతర ప్రాంతంలో ఉండాలని ప్రజలు కోరుకున్నారు' అని అన్నారు.

'ఇప్పుడు ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ మొదటి నుంచి విజయవాడనే రాజధానిగా చేయాలని కోరుకుంటోంది. కొన్ని కారణాలతో కర్నూలు, ఆ తర్వాత హైదరాబాద్ రాజధాని అయ్యాయి. ఇప్పుడు ఏపికీ అమరావతిలో రాజధాని ఉంటే మేము ఇందుకు వ్యతిరేకం కాదు. అయితే, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి' అని నారాయణ అన్నారు.

'గతంలో హైదరాబాద్ లోనే అన్ని వ్యవస్థలను ఉంచడంతో ఆ నగరమే అభివృద్ధి చెందింది. గతంలో అమరావతిని చంద్రబాబు రాజధానిగా చేస్తానన్నారు. పని కన్నా ఆర్భాటం ఎక్కువ చేశారు. ప్రభుత్వమే భూమిని సమీకరించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వచ్చే డబ్బులతో రాజధాని కట్టాలన్న ప్రతిపాదనతో గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది సరికాదు. రాంగ్ స్టెప్ వేశారు' అని నారాయణ వ్యాఖ్యానించారు.

'కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయలేదు. చంద్రబాబు తీరుతో నష్టం వచ్చింది. చంద్రబాబును దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో కక్షపూరిత వైఖరితో జగన్ చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు గతంలో తీసుకున్న చర్యలన్నింటికీ అడ్డంగా నిలబడాలని కక్షతో వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో కక్ష సరికాదు. చేసేది మంచా? చెడా? అన్న విషయాలను చూసుకోవాలి. జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు' అని నారాయణ విమర్శించారు.

More Telugu News