amaravati: 'రాజధాని' గందరగోళానికి సగం చంద్రబాబు.. సగం జగన్ కారణం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • కమిటీని జీఎన్ రావు కమిటీ అనడం కంటే జగన్ కమిటీ అనడం మేలు  
  • ఇక్కడి ప్రాంతాల ప్రజలు తన్నుకోవాలని ఓ సలహా ఇచ్చేసింది 
  • టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 'ఆ కమిటీని జీఎన్ రావు గారి కమిటీ అనడం కంటే జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ అనడం బాగుటుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ లో ఈ పేరును రాసుకోవాలి. ఎందుకంటే ఏపీలో జీఎన్ రావు గారి కమిటీ అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ ఇక్కడి ప్రాంతాల ప్రజలు తన్నుకోవాలని ఓ సలహా ఇచ్చేసింది' అని విమర్శలు గుప్పించారు.

'ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా తమ ప్రాంతంలో అసెంబ్లీ, సచివాలయం వద్దని చెబుతారా? ఐదేళ్లు గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని ఆయన కొడుకు కోసం ధారాదత్తం చేసి ఈ రాష్ట్రాన్ని ముంచేసి ఆయన వెళ్లిపోయారు. ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నాడు.. రాయలసీమకు సంబంధించిన విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నాడు.

ఏమయినా అంటే అమరావతిలో రాజధాని ఉండాలని అంటున్నాడు. మరి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఏం చేస్తాడు? టీడీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు పలు ప్రాంతాల్లో రాజధానులను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. వారు ఎప్పుడెప్పుడు టీడీపీ నుంచి వెళ్లిపోదామా అని చూస్తున్నారు' అని అన్నారు. టీడీపీ అధినేత, నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని పెంచేలా ఉన్నాయని అన్నారు.

'ప్రస్తుత ప్రభుత్వం ఒక విషయాన్ని చెప్పాలి. అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తారా? పరిపాలనను వికేంద్రీకరణ చేస్తారా? ఈ రెండింటి విషయాల్లో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. రాయలసీమకు హైకోర్టు రావాల్సిందే. ఈ విషయాన్ని మేము కూడా సమర్థిస్తాం. అయితే, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి. స్పష్టమైన వైఖరితో ప్రణాళికలు వేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితికి సగం చంద్రబాబు నాయుడు కారణమైతే, సగం జగన్ కారణం. వీరిద్దరు ఏపీని తమ జాగీరు అనుకుంటున్నారు' అని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

More Telugu News