Air India: ఎయిరిండియా అమ్మేస్తే ప్రజల హృదయం బరువెక్కుతుంది: ఉద్యోగ సంఘాలు

  • దేశానికి అది ఆభరణంలాంటిది 
  • గడచిన మూడేళ్లుగా లాభాల్లో ఉంది 
  • పాత అప్పులు తీరితే సమస్య తీరుతుందని సూచన

దేశానికి బంగారు ఆభరణంలాంటి ఎయిరిండియాను అమ్మవద్దని, దాన్ని అమ్మేస్తే ప్రజల హృదయాలు బరువెక్కుతాయని సంస్థ యూనియన్లు విజ్ఞప్తి చేశాయి. అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదిలించుకోవాలని చూస్తోందని, దానికంటే అందుకు కారణాలను గమనించాలని కోరారు. ఈ మేరకు ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్, ఆలిండి క్యాబిన్ క్రూ అసోసియేషన్, ఇండియన్ పైలట్స్ గిల్డ్ సహా ఆరు యూనియన్లు సంయుక్తంగా ఈ లేఖను ప్రధానితోపాటు కేంద్ర మంత్రులకు రాశాయి.

వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఎయిరిండియాలో వాటాలు వంద శాతం విక్రయించనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పార్లమెంటులో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై యూనియన్లు తమ ఆవేదన వెళ్లబోసుకుంటూ లేఖ రాశాయి.

గత కాలం అప్పులే సంస్థకు భారంగా పరిణమించాయని, తెచ్చిన అప్పుల వడ్డీలకే ఆదాయం పోతోందని తెలిపాయి. వాస్తవానికి మూడేళ్లుగా సంస్థ లాభాల్లో నడుస్తోందని, అయినా పాత అప్పుల భారం వల్ల కోలుకోలేకపోతోందని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం పాత రుణాలను మాఫీ చేసి ప్రొఫెషనల్ యాజమాన్యంతో ఎయిరిండియాను నడిపిస్తే కోలుకుంటుందని సూచించారు.

More Telugu News