కామాంధుడైన తండ్రికి పదేళ్ల జైలు...50 వేల జరిమానా

21-12-2019 Sat 10:57
  • కన్నకూతురి పైనే లైంగిక దాడి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మమ్మ
  • ఐదేళ్ల క్రితం విశాఖలో సంచలనం రేపిన కేసు

కామాంధుడైన తండ్రికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురి పైనే లైంగిక దాడికి పాల్పడిన ఆ తండ్రికి జైలుశిక్షతోపాటు 50 వేల జరిమానా కూడా విధించింది. ఐదేళ్ల క్రితం విశాఖ నగరంలో ఈ కేసు సంచలనమైంది. అప్పట్లో మహిళా సంఘాలు రోడ్డెక్కి చాలా రోజులపాటు ఆందోళనలు చేశాయి.

ప్రాసిక్యూషన్ కథనం మేరకు, బీచ్ రోడులోని ఓ అపార్ట్మెంటులో డెరిక్ హేయస్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇతనికి భార్య, పదకొండేళ్ల కుమార్తె ఉన్నారు. దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్య విడాకులు తీసుకుని అబుదాబీ వెళ్లిపోయింది. దీంతో వీరి కుమార్తె అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉండేది.

డెరిక్ అప్పుడప్పుడూ కుమార్తెను చూడడానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాడు. కొన్నిసార్లు కూతురిని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అదేవిధంగా 2014 అక్టోబరు 22న తాతగారింట్లో ఉన్న కుమార్తెను బీచ్ రోడ్డులోని తన ఇంటికి తీసుకువచ్చాడు. రాత్రి కూతురు నిద్రపోయే సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఉదయం నిద్రలేచిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని అమ్మమ్మకు తెలియజేసింది. దీంతో ఆమె డెరిక్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన అప్పట్లో నగరంలో సంచలనం రేపింది. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి ప్రభుత్వం విచారణ చేపట్టించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణుగోపాలరావును నియమించింది.

అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు విచారణాంశాలు కోర్టు ముందుంచారు. ఆధారాలు పరిశీలించిన కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. జరిమానా చెల్లిం చని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. విశాఖలో ఏర్పాటైన పోక్సో చట్టం–2012 పరిధిలోని నూతన న్యాయస్థానంలో ఇదే తొలితీర్పు కావడం విశేషం.