Disha: దిశ నిందితుడు చెన్నకేశవులు భార్యకు 13 సంవత్సరాలేనట.. ప్రాథమిక విచారణలో వెల్లడి

  • బాధితురాలి గ్రామంలో విచారణ జరిపిన అధికారులు
  • స్కూలు నుంచి వివరాల సేకరణ
  • బాలల సదనానికి పంపేందుకు బాధిత బంధువుల నిరాకరణ

దిశ హత్యాచార కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనర్ అని తాజా విచారణలో తేలింది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు నిన్న నిందితుడి గ్రామంలో జరిపిన ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైంది. ఆమె చదువుకున్న పాఠశాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా బాధితురాలి వయసు 13 సంవత్సరాల ఆరు నెలలని తెలిసింది.

 చెన్నకేశవులు తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు ఆమె మైనర్ కావడంతో బాలల సదనంలో ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి అని, సదనానికి పంపబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం బాబాయి ఇంట్లో ఉంటున్న బాలిక చెల్లెలు, తమ్ముడినైనా పంపించాలని కోరగా, బాధితురాలి చెల్లెలు తమ వద్దే ఉంటుందని, కావాలంటే ఆమె తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తామని అతడి బాబాయి అధికారులకు తెలిపారు.

బాధిత బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ ఇంట్లో ఉంటోంది. చెన్న కేశవులును ప్రేమించి పెళ్లాడిన తర్వాత అత్తగారింటికి వచ్చింది. అయితే, ఆమె చెల్లెలు, తమ్ముడు మాత్రం బాబాయి ఇంట్లోనే ఉంటున్నారు. కాగా, తాము తయారుచేసిన ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News