Telugudesam: అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, కానీ రాజధాని మాత్రం ఒకటే ఉండాలి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

  • జీఎన్ రావు నిపుణుల కమిటీ సూచన దారుణం
  • విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు, సచివాలయమా!  
  • రాష్ట్రానికి కావాల్సింది రీజనల్ బోర్డులు కాదు, రీజనల్ డెవలప్ మెంట్

ఏపీని అభివృద్ధి, రాజధానుల అంశంపై జీఎన్ రావు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు చేశారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్టణంలో సీఎం క్యాంపు ఆఫీసు, సచివాలయం ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫారసు చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రానికి కావాల్సింది రీజనల్ బోర్డులు కాదు, రీజనల్ డెవలప్ మెంట్ అని అన్నారు.  

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే జరిగిందని, అలా జరగకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళ్లారని అన్నారు. టీడీపీ హయాంలో అనంతపురం, చిత్తూరు, కాకినాడ, వైజాగ్, నెల్లూరు బాగా అభివృద్ధి చెందాయని, ఈ ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒక ఫైనాన్షియల్ సెంటర్, పొలిటికల్ సెంటర్ వేరేగా ఉండొచ్చు కానీ, పొలిటికల్ సెంటర్ ను మూడు ముక్కలుగా చేసి విజయవంతమైన దాఖలాలు ఎక్కడా లేవని అన్నారు.

మూడు రాజధానులకు ఉదాహరణగా దక్షిణాఫ్రికా దేశాన్ని చెబుతున్నారు కానీ, అందుకు చారిత్రక కారణాలు ఉన్నాయని చెబుతూ చరిత్ర గురించి ప్రస్తావించారు. నాడు ఫ్రెంచ్ కాలనీ, డచ్ కాలనీ, ఇంగ్లీషు కాలనీ.. అంటూ అక్కడ మూడు కాలనీలు ఉండేవని, ఈ మూడింటిని కలిపి ఒక దేశంగా ఏర్పాటు చేసిన సమయంలో మూడు రాజధానులు ఏర్పడ్డాయని చెప్పారు.

మూడు రాజధానుల వ్యవహారం చాలా కష్టమని, ఆర్థికంగా చాలా భారంగా ఉందని అప్పటి అధ్యక్షుడు నెల్సన్ మండేలా నుంచి ఇప్పటి అధ్యక్షుడు జూమా వరకు ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. మన రాష్ట్రానికి కూడా అదే పరిస్థితి ఎదురుకావచ్చని, మూడు రాజధానులతో ప్రభుత్వానికి మరింత ఖర్చు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ హయాంలో చేశాం, ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా చేయమనండి కానీ, రాజధాని మాత్రం ఒకటే ఉండాలని డిమాండ్ చేశారు.

More Telugu News