కొత్త సెలెక్షన్ కమిటీ కోసం బీసీసీఐ సన్నాహాలు

20-12-2019 Fri 19:28
  • ముగియనున్న ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం
  • కొత్త సెలెక్టర్ల ఎంపిక కోసం సలహా సంఘం
  • త్వరలోనే నియామకం

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కాలపరిమితి మరికొన్నిరోజుల్లో ముగియనుంది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తో పాటు ప్యానెల్ సభ్యుడు గగన్ ఖోడా పదవీకాలం పూర్తికావొచ్చింది. ఇతర సభ్యులు దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపే, శరణ్ దీప్ సింగ్ లకు మరో ఏడాది పదవీకాలం మిగిలుంది.

ఈ నేపథ్యంలో, కొత్త కమిటీ కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. సెలెక్షన్ కమిటీలో ఖాళీ అయ్యే స్థానాలకు కొత్త సభ్యులను ఎంపిక చేసేందుకు త్వరలోనే సలహా సంఘం ఏర్పాటు చేయనుంది. గతంలో కపిల్ దేవ్ నేతృత్వంలో సలహా సంఘం ఎమ్మెస్కే తదితరులను ఎంపిక చేసింది. ఈసారి సలహాసంఘంలో సభ్యులు ఎవరు? వారు ఎవర్ని సెలెక్టర్లుగా ఎంపిక చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.