Kanakamedala: సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదేదో ఊహించుకుని ఇలాంటి ప్రకటనలు చేయవచ్చా?: ఎంపీ కనకమేడల

  • ఒకవైపు అమరావతిలో భవనాల నిర్మాణం జరుగుతోంది
  • మరోవైపు ప్రభుత్వ ప్రకటనలు జనాలను గందరగోళానికి గురి చేసేలా ఉన్నాయి
  • జీఎన్ రావు కమిటీని ప్రభావితం చేసేలా జగన్ మాట్లాడారు

ఒక వైపు అమరావతి ప్రాంతంలో భవనాల నిర్మాణం కొనసాగుతోందని... మరోవైపు, ప్రభుత్వ ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఉన్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదేదో ఊహించుకుని అసెంబ్లీలో ఇలాంటి ప్రకటనలు చేయవచ్చా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చేమో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తుంటే... వారిని హేళన చేస్తారా? అని మండిపడ్డారు.

జీఎన్ రావు కమిటీ నివేదికను ప్రభావితం చేసేలా జగన్ మాట్లాడారని కనకమేడల అన్నారు. ఈ కమిటీ రాజ్యాంగ మార్పుపై వేసినది కాదని... ఈ కమిటీకి చట్టబద్ధత లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. తీవ్ర నేరాలు ఉన్నవారిపై ఏడాదిలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని... జగన్ , విజయసాయిరెడ్డిలపై అనేక కేసులున్నాయని... సుప్రీం ఆదేశాల మేరకు వారిద్దరూ నిర్దోషులుగా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News