Narasaraopet: నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది: వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

  • నా మాటలకు తల, తోక తీసేసింది
  • సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా
  • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన

అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే చోట ఉంటే బాగుంటుందంటూ నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపిరెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, తన మాటలకు తల, తోక తీసేసిందని మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న సీఎం జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన అని, జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. అమరావతి భూముల్లో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని, నాలుగు వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు తన అనుచరులకు తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని, అమరావతిలో సామాన్యుడు భూమి కొనుగోలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఆందోళనలు జరగడం లేదని, టీడీపీ వెనక ఉండి రెచ్చగొట్టే ధోరణి చేస్తోందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వారి ఆందోళన అని ధ్వజమెత్తారు.

More Telugu News