Jana Sena: రైతులు త్యాగాలు చేశారు.. వారి సమస్యలు పవన్ కు తెలుసు: 'రాజధాని పోరు'లో నాదెండ్ల మనోహర్

  • రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం
  • రైతులకు రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారు
  • రైతుల కులాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు?
  • ఈ ప్రభుత్వం రైతులను గౌరవించాలి

రాజధానిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై అమరావతి రైతులు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మందడంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ తమ నేతలతో కలిసి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ...  రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని అన్నారు. రైతులకు రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారని, రైతుల కులాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారని, రాజధాని రైతుల సమస్యలు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తెలుసని అన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం రైతులను గౌరవించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. 70 శాతం రైతులు ఐదు ఎకరాల లోపు భూములు ఉన్నవారేనని, రైతులకు తాము అండగా ఉంటామని చెప్పారు. అధికారం ఉందని రైతులను బాధపెట్టడం సరికాదని అన్నారు.

రాజధానిపై ప్రభుత్వం వేసిన కమిటీలోని సభ్యులు ఎన్నడైనా అమరావతికి వచ్చారా? రైతుల అభిప్రాయాలను తీసుకున్నారా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నలు సంధించారు. ప్రజలకు నష్టం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు.

More Telugu News