Bhadradri Kothagudem District: మూగజీవాల విశ్వాసం... ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడిన శునకాలు!

  • కోతుల బెడద ఉండడంతో పొలానికి కాపలాగా వెళ్లిన రైతు
  • అప్పటికే పొంచివున్న ఎలుగుబంటి దాడి
  • దాన్ని వెంటపడి తరిమిన రెండు కుక్కలు

కుక్క విశ్వాసానికి చిహ్నం. నమ్మిన యజమాని కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా వుంటుంది. ఇందుకు చక్కని ఉదాహరణ నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన. పాల్వంచ మండలం గంగిదేవిపల్లికి చెందిన కాలం బక్కయ్య రైతు. ఇతను పార్కలగండి ప్రాంతంలోని తన పొలంలో ఉలవ పంట వేశాడు. 

ఇక ఈ పంటకు కోతుల బెడద అధికంగా ఉండడంతో పంట కాపలాకు రోజూ వెళ్తుంటాడు. బక్కయ్య వెంట ఆయన పెంపుడు శునకాలు రెండూ వెళ్తుంటాయి. నిన్న కూడా ఎప్పటిలాగే బక్కయ్య వెళ్లాడు. అప్పటికే తీవ్రంగా పొగమంచు పట్టి ఉండడంతో దూరంగా ఉన్నవేవీ కనిపించడం లేదు.

అప్పటికే అతని పొలంలోకి ఓ ఎలుగుబంటి వచ్చింది. ఇది గమనించని బక్కయ్య ఎప్పటిలాగే పంట పాడుచేస్తున్న కోతులను తరుముకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయానికి అక్కడే పొంచివున్న ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది.

ఈ హఠాత్ పరిణామంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు బక్కయ్య. యజమాని ప్రమాదంలో పడినట్టు గుర్తించిన రెండు శునకాలు ఎలుగుబంటిపై ఏకకాలంలో దాడి చేయడంతో అది అక్కడి నుంచి  పరుగందుకుంది. అయితే అప్పటికే ఎలుగు దాడిలో ముఖం, శరీరంపై తీవ్రగాయాలై బక్కన్న స్పృహతప్పి పడిపోయాడు.

వెంటనే రెండు శునకాల్లో ఒకటి యజమానికి కాపలాగా ఉండగా, మరొకటి ఇంటికి పరుగందుకుంది. ఇంటికి వచ్చిన శునకం ప్రవర్తనతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పంటపొలం వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసింది. వెంటనే బక్కయ్యను పాల్వంచలోని ఆసుపత్రికి తరలించారు. మూగజీవాల సాహసం వల్లే తాను ప్రాణాలతో మిగిలానని బక్కయ్య తెలిపాడు.

More Telugu News