Nirbhaya: ‘నిర్భయ’ దోషి పవన్ రివ్యూ పిటిషన్ కొట్టివేత.. అతని తరఫు న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం

  • ఈ ఘటన జరిగే సమయానికి తాను మైనర్ ని అంటూ పవన్ పిటిషన్
  • ‘మైనర్’ అని నిరూపణకు కొంత సమయం కావాలని వినతి
  • ‘నిర్భయ’ తరఫు లాయర్ అభ్యంతరంతో పిటిషన్ కొట్టివేత

‘నిర్భయ’ దోషి పవన్ కుమార్ గుప్తా రివ్యూ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఘటన జరిగే సమయానికి తాను మైనర్ ని అని, ఐపీసీ ప్రకారం తనను ఉరితీయడం కుదరదంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈరోజు ఉదయం ఈ పిటిషన్ పై విచారణ జరిగింది.

ఈ సందర్బంగా ముందుగా, దోషి తరఫు న్యాయవాది తమ వాదనను వినిపించారు. పవన్ ‘మైనర్’ అని నిరూపించుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లను దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరడంతో జనవరి 24వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది. అయితే, ఈ పిటిషన్ పై నిర్భయ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, వాయిదా వేస్తూ ఇచ్చిన ఆర్డర్ ను రీకాల్ చేసింది.  
 
 పవన్ తరఫు న్యాయవాదికి జరిమానా విధింపు

కోర్టు సమయం వృథా చేస్తున్నారంటూ పవన్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.25 వేలు జరిమానా విధించింది. ఏపీ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్ కు సూచించింది.

More Telugu News