amaravati: అమరావతి ఒక పెద్ద స్కామ్: వైసీపీ నేత అంబటి రాంబాబు

  • రాజధానిలో జరిగిన మోసాన్ని కచ్చితంగా బయట పెడతాం
  • జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
  • సహజంగానే జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు
  • రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు

అమరావతి ఒక పెద్ద స్కామ్ అని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. విశాఖపట్నంలోని తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు, ఆయన బినామీలు రాజధాని పేరుతో కోట్లు కాజేయాలనుకున్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ట్రాన్స్ ఫర్ చేయకూడదు. 4070 ఎకరాలు కొన్నది చంద్రబాబు అనుచరులు కాదా?' అని ప్రశ్నించారు.

'రాజధానిలో జరిగిన మోసాన్ని కచ్చితంగా బయట పెడతాం. అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. రైతుల ముసుగులో చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. జగన్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారు' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

'మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందని అసెంబ్లీలో జగన్ చెప్పారు. జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదు. రాజధాని అంటే కేవలం నగరాల నిర్మాణం కాదు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు' అని అంబటి రాంబాబు అన్నారు.

More Telugu News