India: వెస్టిండీస్ 280 ఆలౌట్... వైజాగ్ వన్డేలో టీమిండియా ఘనవిజయం

  • విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచిన భారత్
  • పోరాడిన హోప్, పూరన్
  • మ్యాచ్ ను మలుపుతిప్పిన షమీ, కుల్దీప్

కోహ్లీ సేన లెక్క సరిచేసింది. మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డే ఓటమికి వైజాగ్ లో ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడి వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 388 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో విజయం దిశగా సాగుతున్న ఆ జట్టును షమీ దెబ్బతీయడంతో మ్యాచ్ మలుపుతిరిగింది. షమీ వరుస బంతుల్లో పూరన్, పొలార్డ్ లను అవుట్ చేశాడు. ఆపై కుల్దీప్ యాదవ్ అద్భుతమైన హ్యాట్రిక్ తో కోలుకోలేని నష్టం కలుగజేశాడు.

విండీస్ జట్టులో ఓపెనర్ షాయ్ హోప్ 78, నికోలాస్ పూరన్ 75 పరుగులు సాధించారు. చివర్లో కీమో పాల్ 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పొలార్డ్ డకౌట్ కావడం విండీస్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లు ఆడిన తొలి బంతికే వెనుదిరగడం విచిత్రం! కాగా, భారత బౌలర్లలో కుల్దీప్, షమీ చెరో మూడు వికెట్లు తీయగా, జడేజా 2, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.

అంతకుముందు  ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5 వికెట్లకు 387 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ సెంచరీలు చేయగా, చివర్లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వీరవిహారం చేశారు. ఈ విజయంతో భారత్ సిరీస్ ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డే డిసెంబరు 22న కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగనుంది.

More Telugu News