Telangana: మద్యం విక్రయాలను కేసీఆర్ ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు: భట్టి విక్రమార్క

  • మద్యం ఆదాయంతో ప్రభుత్వ అప్పులు తీర్చాలనుకుంటున్నారని ఎద్దేవా
  • కేసీఆర్ తన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి
  • కాంగ్రెస్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేపడతాము

తెలంగాణలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మద్యం విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్ తన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని సూచించారు.

ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో భేటీ అయ్యారు. కేసీఆర్ తన విధానాలను మార్చుకోకపోతే.. కాంగ్రెస్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులను మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో తీర్చాలనుకుంటున్నారని విమర్శించారు. సామాన్యులు ఎక్కువ శాతం చీప్ లిక్కర్ ను తాగుతారన్నారు. మద్యం విక్రయాల్లో దీని వాటా ఎక్కువంటూ.. ఈ భారమంతా వారే మోస్తారన్నారు. ప్రాజెక్టులపై అంచనా వ్యయాలను పెంచి బ్యాంకుల నుంచి అప్పు తెస్తున్నారని ఆరోపించారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టమొచ్చినట్లు అప్పులివ్వ వద్దని వాణిజ్య బ్యాంకులను కోరతామన్నారు.

More Telugu News