BJP: నాపై కుట్రతోనే రౌడీషీట్ తెరిచారు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • రౌడీషీట్ ఓపెన్ చేసిన మంగళ్హాట్ పోలీసులు
  • ప్రతిపక్షం లేకుండా చేయాలని టీఆర్ఎస్ కుట్ర
  • ఎంఐఎం ఒత్తిడితోనే నాపై రౌడీషీట్ ఓపెన్ చేశారు

తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రౌడీషీట్ తెరిచారు. హైదరాబాద్ లోని మంగళ్హాట్ పోలీసులు తనపై రౌడీషీట్ ఓపెన్ చేయడంపై రాజాసింగ్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని మీడియా పలకరించగా.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగానే రౌడీ షీటర్ల లిస్ట్ లో తన పేరు చేర్చారని ఆరోపించారు.

అధికార పార్టీ చేతిలో పోలీసులు కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. ఈ విషయమై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతల ఒత్తిడితోనే తనపై రౌడీషీట్ తెరిచారని ఆరోపించిన రాజాసింగ్, టీఆర్ఎస్ నేతలు, మంత్రులపై రౌడీషీట్లు లేవా? అని ప్రశ్నించారు. తనపై రౌడీషీట్ ఎందుకు తెరిచారో సీఎం కేసీఆర్ ను అడుగుతానని అన్నారు. కొంతమంది తన మిత్రులు వాట్సాప్ ద్వారా ఓ లిస్ట్ పంపించారని, ఆ లిస్ట్ చూసి తాను షాకయ్యానని చెప్పారు.

‘నేను ఒక ఎమ్మెల్యేనా? రౌడీ షీటర్ నా?’ అన్న విషయం తనకే అర్థం కావట్లేదని, గతంలో కూడా టీఆర్ఎస్ కు గులాంగిరీ చేసే పోలీసు అధికారి ఏకే ఖాన్ తనపై రౌడీషీట్ ఓపెన్ చేశారని రాజాసింగ్ విమర్శించారు. ‘నాపేరు ఒక్కటేనా?’ లేక టీఆర్ఎస్ లో కూడా ఎంతోమంది రౌడీషీటర్లు ఉన్నారు వారి పేర్లు కూడా పోలీస్ స్టేషన్ లో పెడతారా? గతంలో ఎంతో మంది రౌడీషీటర్లుగా ఉన్నవాళ్లు ఇప్పుడు మంత్రులు అయ్యారు, వారి పేర్లు కూడా ఆయా పోలీస్ స్టేషన్లలో పెడతారా?’ అంటూ డీజీపీకి ప్రశ్నలు సంధించారు.

 గతంలో పోలీస్ అధికారులు నీతి నిజాయతీలతో పని చేసేవారని, ఇప్పుడు, కొంతమంది అధికారులు ఎంఐంఎం చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. తనపై రౌడీషీట్ తెరిచిన విషయాన్ని పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతామని రాజాసింగ్ స్పష్టం చేశారు.

More Telugu News