UN: కశ్మీర్ పై చైనా విన్నపం... ఈరోజు భేటీ అవుతున్న భద్రతామండలి

  • జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించనున్న భద్రతామండలి
  • ఆర్టికల్ 370 రద్దైన తర్వాత ఇది రెండో సమావేశం
  • ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన చైనా, పాక్

జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితిలో కీలక విభాగమైన భద్రతామండలి నేడు భేటీ కానుంది. చైనా విన్నపం మేరకు భద్రతామండలి నేడు జమ్ముకశ్మీర్ అంశాన్ని చర్చించనుంది. ఈ సమావేశం పూర్తిగా రహస్యంగా (క్లోజ్డ్ డోర్) జరగనుంది. దీనికి సంబంధించిన కవరేజ్ బయటకు వచ్చే అవకాశం లేదు. ఇదే అంశంపై గతంలో చైనా, పాకిస్థాన్ కోరిక మేరకు ఆగస్టులో భద్రతామండలి భేటీ అయింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆ భేటీ జరిగింది. ఆ తర్వాత ఈ అంశంపై సెక్యూరిటీ కౌన్సిల్ భేటీ కానుండటం ఇదే తొలిసారి.

జమ్ముకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ డిసెంబర్ 12న భద్రతామండలికి లేఖ రాశారు. దీనికి కొనసాగింపుగా చైనా కూడా లేఖ రాసింది. పాకిస్థాన్ ఆందోళనతో తాము కూడా ఏకీభవిస్తున్నామని... జమ్ముకశ్మీర్ ప్రస్తుత పరిస్థితులపై భద్రతామండలిలో చర్చ జరగాలని లేఖలో కోరింది. ఈ నేపథ్యంలో, నేడు భద్రతామండలి జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించనుంది.

More Telugu News