Nirmala Sitharaman: విద్యార్థుల ఆందోళనలపై సోనియా మొసలి కన్నీరు కారుస్తున్నారు: నిర్మలా సీతారామన్

  • దేశంలో పౌరసత్వ చట్టంపై నిరసనలు
  • రగులుతోన్న ఢిల్లీ
  • కేంద్రంపై సోనియా విమర్శలు
  • తీవ్రంగా స్పందించిన నిర్మలా సీతారామన్

దేశంలో నూతన పౌరసత్వ చట్టం రగిలించిన నిరసన జ్వాలలు ఇంకా ఆరలేదు సరికదా దేశ రాజధాని ఢిల్లీ సైతం అట్టుడికే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనల పట్ల సోనియా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని, నాడు ఇందిరాగాంధీ పాలనలో ఢిల్లీ సెంట్రల్ వర్శిటీ విద్యార్థులను తీహార్ జైలుకు పంపలేదా? అని ప్రశ్నించారు. ఇందిర చర్య కారణంగా ఆ ఏడాది విద్యార్థులు ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోయారని గుర్తుచేశారు.

రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ దుష్ప్రచారానికి పాల్పడుతోందని నిర్మల మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు తరలివచ్చిన శరణార్థులను ఆదుకోవాలని మన్మోహన్ సింగ్ కోరారని, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని నిలదీశారు.

నిన్న సోనియా ఓ ప్రకటన చేస్తూ, ప్రధాని మోదీ, అమిత్ షాలే దేశంలో చిచ్చు పెడుతున్నారని, అమిత్ షాకు దమ్ముంటే ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని సవాల్ విసిరారు. యువత హక్కులను లాగేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపైనే నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు.

More Telugu News