NRC: జామియా వర్శిటీలోకి వెళ్లేందుకు పోలీసులకు అనుమతి ఎవరిచ్చారు?: గులాం నబీ ఆజాద్

  • పోలీసుల తీరు అమానవీయం
  • వర్శిటీలోకి వెళ్లి విద్యార్థుల వెంటబడ్డారు
  • ఈ ఘటనలకు ప్రధాని, మంత్రి వర్గం పూర్తి బాధ్యత వహించాలి

  పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. ఢిల్లీలో విపక్ష పార్టీలు ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూనివర్శిటీలోకి వెళ్లేందుకు పోలీసులకు అనుమతి ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

వర్శిటీలోకి వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానవీయంగా ఉందని, పోలీసులు విద్యార్థుల వెంటబడ్డారని మండిపడ్డారు. నిన్న ఢిల్లీ యూనివర్శిటీలో తీవ్రమైన ఆందోళనలు జరిగాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలకు ప్రధాని సహా మొత్తం మంత్రి వర్గం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేసి బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

More Telugu News