Disa: రేప్ లకు పాల్పడ్డ సొంత సామాజికవర్గం వాళ్లపై చర్యలు లేవా?: జగన్ కు యనమల సూటి ప్రశ్న

  • దిశ బిల్లు తర్వాత అత్యాచారాలు జరగడం సిగ్గుచేటు
  • నిందితులపై చర్యల విషయంలో ఉదాసీనత తగదు
  • శాసనసభా సమావేశాలు సీఎం అహంభావానికి నిదర్శనం  

దిశ బిల్లు వచ్చిన తర్వాత కూడా ఏపీలో అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిందితులపై చర్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఐదు రోజుల శాసన సభా సమావేశాలు జరిగిన తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ సమావేశాలు సీఎం జగన్ అహంభావానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. ప్రతిపక్షం నిలదీస్తుంటే తట్టుకోలేకే జగన్ నిరంకుశపోకడలు పోతున్నారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ చర్యలన్నీ ప్రజావ్యతిరేకమే అని రుజువు చేశామని చెప్పారు. తాము అడిగిన ప్రశ్నలకు వైసీపీ చెప్పిన సమాధానాలన్నీ తప్పుల తడకలేనని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో బలహీనవర్గాలకు అప్రధాన పదవులు ఇచ్చి, తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి కీలకపదవులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. చివరకు సామాజిక న్యాయం విషయంలోనూ జగన్ నయవంచనకు పాల్పడ్డారని, రేప్ లకు పాల్పడ్డ సొంత సామాజికవర్గం వాళ్లపై చర్యలు లేవా? అంటూ జగన్ కు ఆయన సూటి ప్రశ్న వేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు సిగ్గపడాలని అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే జీవో 2430ను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News