ఇంటిపేరు 'సావర్కార్' ఉండాలంటే వీరుడై ఉండాలి: రాహుల్ పై శివరాజ్ చౌహాన్ సెటైర్!

15-12-2019 Sun 08:32
  • రాహుల్ వ్యాఖ్యలపై దుమారం
  • సావర్కార్ అంటే త్యాగం, వీరత్వమన్న సంజయ్ రౌత్
  • రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఫడ్నవీస్

న్యూఢిల్లీలో నిన్న జరిగిన భారత్ బచావో ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, తానేమీ రాహుల్ సావర్కార్ ను కాదని, రాహుల్ గాంధీనని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ, శివసేన పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. "మీ ఇంటి పేరు సావర్కార్ అని ఉండాలంటే, మీరు వీరుడై ఉండాలి" అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.

సావర్కార్ అంటే త్యాగం, వీరత్వం అని శివసేన నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని కొనియాడారు. గాంధీ, నెహ్రూలా దేశం కోసం ఆయన శ్రమించారని, ప్రాణాలను అర్పించిన యోధుడని గుర్తు చేశారు. సావర్కార్ ను అవమానిస్తే తాము చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. ఇదే విషయమై మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, రాహుల్ వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు.