జేడీయూకు ప్రశాంత్ కిశోర్ రాజీనామా... తిరస్కరించిన నితీశ్ కుమార్!

15-12-2019 Sun 07:33
  • పౌరసత్వ బిల్లుపై ఇద్దరి మధ్యా విభేదాలు
  • తొలుత వ్యతిరేకించి, ఆపై మద్దతు పలికిన నితీశ్
  • నితీశ్ మాట మార్చడంపై ఆగ్రహంతో ఉన్న ప్రశాంత్

ఎన్నికల వ్యూహకర్త, బీహార్ లో అధికార జేడీయూలో నితీశ్ కుమార్ తరువాత రెండో స్థానంలో ఉన్న ప్రశాంత్ కిశోర్, తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయగా, దాన్ని నితీశ్ తిరస్కరించారు. వీరిద్దరి మధ్యా దాదాపు 90 నిమిషాల పాటు సమావేశం జరుగగా, ఇది వీడ్కోలు సమావేశమేనని అందరూ భావించారు. కానీ, ప్రశాంత్ రాజీనామాను సీఎం అంగీకరించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, వీరిద్దరి మధ్యా పౌరసత్వ బిల్లు విషయంలో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చిన నితీశ్, ఇప్పుడీ బిల్లుకు మద్దతు పలకడమే ప్రశాంత్ కిశోర్ ఆగ్రహానికి కారణమని సమాచారం. కొత్త పౌరసత్వాలను ఇచ్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఇటీవల వ్యాఖ్యానించిన నితీశ్, ప్రశాంత్ కిశోర్ రాజీనామా నిర్ణయం తరువాత కాస్తంత మెత్తబడ్డారని, త్వరలోనే ఆయన సిటిజన్ షిప్ చట్టంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

వచ్చే సంవత్సరంలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ మార్గంలోనే నడుస్తుంటే, రాష్ట్రంలో నిర్ణయాత్మక స్థాయిలో ఓట్లను కలిగివున్న ముస్లిం వర్గానికి దూరమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.