Chiranjeevi: బంధువులు విదేశాల్లో ఉండడంతో గొల్లపూడి అంత్యక్రియలు ఆలస్యం.. నివాళులు అర్పించిన చిరంజీవి

  • అనారోగ్యంతో కన్నుమూసిన గొల్లపూడి
  • రేపు అంత్యక్రియలు
  • నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు

నటుడిగా, రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతో పేరుతెచ్చుకున్న గొల్లపూడి మారుతీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ తో బాధపడుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. అయితే, గొల్లపూడి బంధువులు చాలామంది విదేశాల్లో ఉండడంతో అంత్యక్రియలు ఆలస్యంగా నిర్వహించాల్సి వస్తోందని ఆయన కుమారుడు రామకృష్ణ వెల్లడించారు. రేపు చెన్నైలో గొల్లపూడి అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని శారదాంబల్ లోని ఆయన నివాసానికి సందర్శకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

సినీ ప్రముఖులు, అభిమానులు గొల్లపూడిని కడసారి చూసేందుకు వస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు, భానుచందర్, సుహాసిని తదితరులు గొల్లపూడికి నివాళులు అర్పించారు. అగ్రనటుడు చిరంజీవి కూడా గొల్లపూడి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొల్లపూడితో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని 1979లో తామిద్దరికి పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. అప్పటినుంచి ఇటీవల వరకు తమ అనుబంధం కొనసాగిందని తెలిపారు.

 తన కుమారుడు శ్రీనివాస్ పేరిట అవార్డు ఇస్తూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారని, అప్పుడే ఆయన్ను చివరిసారిగా చూశానని పేర్కొన్నారు. ఇప్పుడిలా ఆయన నివాసానికి వచ్చి పార్థివదేహాన్ని చూడాల్సిన దురదృష్ట పరిస్థితి వస్తుందని ఊహించలేదని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

More Telugu News