Jagan: ఆరోజు జగన్ జైలుకు వెళ్లడానికి కారణం నువ్వు కాదా?: చంద్రబాబుపై అంబటి నిప్పులు

  • చంద్రబాబుపై అంబటి ధ్వజం
  • వైఎస్సార్ మరణం తర్వాత దారుణ పరిస్థితులు సృష్టించారంటూ ఆరోపణ
  • సోనియాతో చేతులు కలిపారని ఆగ్రహం

ఏపీ సీఎం జగన్ గతంలో జైలుకు వెళ్లడానికి కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడేనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అంబటి తీవ్రస్థాయిలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ మరణం తర్వాత దారుణమైన పరిస్థితులు సృష్టించారని, జగన్ 16 మాసాలు జైల్లో ఉండడానికి కారణం నువ్వు కాదా? అని చంద్రబాబును నిలదీశారు.

"జగన్ హైకమాండ్ ను కాదని ఓదార్పు యాత్ర మొదలుపెడితే చంద్రబాబు వెళ్లి సోనియాతో చేతులు కలిపారు. వారిద్దరూ కలిసి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కారణంగానే జగతి పబ్లికేషన్స్ పై కేసులు నమోదవడం కానీ, ఆయన జైలుకెళ్లడం కానీ జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు సగం బలం కూడా లేని పరిస్థితులలో వైసీపీకి అనేకమంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీరు ప్రభుత్వానికి మద్దతు తెలిపి నీచానికి ఒడిగట్టారు" అంటూ మండిపడ్డారు.

ఉన్నతాధికారి కృష్ణకిశోర్ పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న టీడీపీ ఆరోపణలకు బదులిచ్చే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధించే అవసరం తమ ప్రభుత్వానికి లేదని, జగన్ మోహన్ రెడ్డిగారికి అంతకంటే అవసరంలేదని స్పష్టం చేశారు.

More Telugu News