కృష్ణ కిశోర్ సస్పెన్షన్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: అంబటి

14-12-2019 Sat 16:39
  • తప్పు చేశారని ఆధారాలుంటే ఎవరిపైనైనా.. చర్యలు తప్పవు
  • టీడీపీ హయాంలో అనుకూలంగా వ్యవహరించారని కిషోర్ ను వెనకేసుకొస్తున్నారా?
  • చంద్రబాబు, కాంగ్రెస్ కుట్రపన్ని అప్పట్లో జగన్ పై కేసులు పెట్టారు

ఆంధ్రప్రదేశ్ లో ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ సస్పెన్షన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయన్న కారణంగా సస్పెన్షన్ వేటు పడిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కిషోర్ అనుకూలంగా వ్యవహరించారేమోనని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. తప్పు చేశారని ఆధారాలుంటే ఎవరిపైనైనా.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అప్పట్లో చంద్రబాబు, కాంగ్రెస్ కుట్ర పన్ని వైఎస్ జగన్ పై కేసులు పెట్టారని అంబటి ఆరోపించారు.

గతంలో ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పని చేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కిశోర్ సస్పెన్షన్ ను చంద్రబాబు తప్పుబట్టారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన్ని సస్పెండ్ చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

డిప్యుటేషన్ పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేయడం సబబు కాదని అన్నారు. జగన్ క్విడ్ ప్రోకో ద్వారా అవతలి వ్యక్తులకు ఆదాయం వచ్చేలా చేయడాన్ని ఆ రోజున ఎవరైతే తప్పుబట్టారో.. వారిపై ఈ రోజున కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.