'దిశ' చట్టం పనికిరానిది: ఆయేషా తండ్రి ఇక్బాల్ ఆవేదన

14-12-2019 Sat 16:02
  • రేపిస్టులకు 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యంకాదు
  • తన కుమార్తె ఆయేషా హత్య కేసులో విచారణకు సీబీఐ ఎన్నిరోజులు తీసుకుంటుందో ?
  • ఈ  కేసులో తాము తెలిపిన నిందితులను విచారించారా? అంటూ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తున్న ‘దిశ’ చట్టం బోగస్ అని ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా అన్నారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాజకీయాలకోసం చట్టాలు చేయవద్దన్నారు. రేప్ చేసినట్టు తేలిన నేరస్థులకు 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యం కాదన్నారు. సక్రమంగా దర్యాప్తు చేస్తే నిందితులను పట్టుకోవచ్చన్నారు. తన కుమార్తె ఆయేషా హత్య కేసులో సీబీఐ  విచారణను ఎప్పటికి పూర్తి చేస్తుందో తెలియదని పేర్కొన్నారు. తాము ఆరోపిస్తున్న నిందితులను విచారించారా?  లేదా? అన్న విషయం తమకు తెలియడం లేదని పేర్కొన్నారు. ఆయేషా మీరా కేసులో గతంలో జరిగిన విచారణ అంతా బోగస్ అని చెప్పారు.

ఆయేషా అవశేషాలను సేకరించిన ఫోరెన్సిక్ బృందం

 2007 డిసెంబర్ 27న విజయవాడ శివారులో తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో నిందితుడు సత్యంబాబు నిర్దోషిగా బయటపడటంతో నేరస్థుడెవరో తేల్చేందుకు సీబీఐ నడుం బిగించింది. పన్నెండు సంవత్సరాల క్రితం ఖననం చేసిన ఆయేషా మృతదేహాన్ని బయటకు తీసి రీ పోస్ట్ మార్టమ్ చేయించాలని సీబీఐ రంగం సిద్ధం చేసింది.

ఈ క్రమంలో ఈ రోజు సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహం అవశేషాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. ఈ సందర్బంగా పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించినట్టు తెలుస్తోంది. పూర్తి పరీక్షల అనంతరం దీనిపై ఫోరెన్సిక్ బృందం ఒక నివేదికను సీబీఐకు సమర్పించనుంది.