ayodhya: రామమందిర నిర్మాణానికి ప్రతి కుటుంబం ఒక్కో ఇటుక, రూ.11 చొప్పున విరాళమివ్వాలి: యూపీ సీఎం యోగి పిలుపు

  • జార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగం
  • జమ్మూ కశ్మీర్ లో మోదీ 370 అధికరణను రద్దు చేశారు
  • దేశ ప్రజలు ఇప్పుడు కశ్మీర్, లఢక్, జమ్మూ ప్రాంతాలకు  వెళ్లొచ్చు 

జార్ఖండ్ లోని బగోదర్ లో బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370పై స్పందించారు. రామరాజ్య స్థాపనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు.

'అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కో ఇటుక, అలాగే రూ.11 చొప్పున విరాళంగా ఇవ్వాలి. జమ్మూ కశ్మీర్ లో మోదీ 370 అధికరణను రద్దు చేశారు. దేశ ప్రజలు ఇప్పుడు కశ్మీర్, లఢక్, జమ్మూ ప్రాంతాలకు  వెళ్లొచ్చు.. అలాగే వైష్ణోదేవి, బాబా అమర్‌నాథ్‌ ఆలయాలను సందర్శించుకోవచ్చు' అని యోగి వ్యాఖ్యానించారు.
 
కుల, మత ప్రాతిపదికన దేశం ఎవరి పట్లా వివక్ష చూపలేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పొరుగుదేశాలు పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీలను తరిమిగొట్టడం, మహిళలపై మోసాలకు పాల్పడడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అటువంటి వారు భారత్ లో ఆశ్రయం కోరుతున్నందుకే వారికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం కల్పించాలని చట్టాన్ని రూపొందించిందని చెప్పారు.

More Telugu News