Fire Accident: ఢిల్లీలోని ఫ్లైవుడ్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం.. వారం వ్యవధిలో రెండో అతిపెద్ద ఘటన

  • 21 అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది 
  • ప్రాణ నష్టమైతే లేదని సమాచారం 
  • అనాజ్ మండీ ప్రమాదం మర్చిపోకముందే మరొకటి

వరుస అగ్ని ప్రమాదాలు దేశరాజధాని ఢిల్లీ వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన ఆదివారం అనాజ్ మండీలోని ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదం గురించి మర్చిపోకముందే ఈ రోజు ఉదయం ఓ ప్లైవుడ్ గోదాములో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

ప్రాథమిక సమాచారం మేరకు ప్రాణనష్టం ఏమీ లేకున్నా భారీ మంటల్ని అదుపు చేసేందుకు 21 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే...ఢిల్లీలోని మంద్క ప్రాంతంలో భారీగా ప్లైవుడ్ గోదాములు ఉన్నాయి. ఇందులోని ఓ గోదాములో ఉదయం మంటలు మొదలయ్యాయి.

కాసేపటికే భారీగా మంటలు ఎగసి చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా విస్తరించడం మొదలయ్యింది. సమాచారం అందుకున్న సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది శకటాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే మంటలు ఆర్పడం వారి వల్ల సాధ్యం కాకపోవడం, మంటలు క్రమేణా విస్తరిస్తుండడంతో చుట్టుపక్కల సమీపంలో ఉన్న అన్ని అగ్నిమాపక కేంద్రాలకు కూడా సమాచారం అందించారు.

దీంతో మొత్తం 21 శకటాలతో సిబ్బంది ప్రస్తుతం ఘటనా స్థలిలో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఎదురుగా ఉన్న బల్బుల కంపెనీకి విస్తరించకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు.  గత ఆదివారం అనాజ్ మండీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 43 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

ఢిల్లీ చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్రమాదమని నమోదైంది. ఈ భయానక వాతావరణం నుంచి ఢిల్లీ వాసులు తేరుకోక ముందే తాజా ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనమైంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం లేదన్న ప్రాథమిక సమాచారం కొంత ఊరటనిస్తోంది.

More Telugu News